Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్ (lung cancer) ప్రపంచ వ్యాప్తంగా కలవర పరుస్తోంది. వైద్యరంగానికి ఇది పెద్ద సవాల్‌గా మారింది. మనిషి జీవన ప్రమాణాలను తగ్గించే వ్యాధుల్లో ఇదొకటి. ఊపిరితిత్తుల కణజాలాల్లో ఈ క్యాన్సర్ ఏర్పడుతుంది. అసాధారణ కణాల పెరుగుదల వల్ల సంభవిస్తుంది. మనిషిని తీవ్రంగా పట్టి పీడించే ఈ మహమ్మారిపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీని నుంచి బయట పడే మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొంత సత్ఫలితాలు సాధించారు కూడా. ఇదే క్రమంలో అమెరికన్ శాస్త్రవేత్తలు (American Scientists) ఇటీవల చేసిన పరిశోధన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడే వారికి శుభవార్తే చెప్పింది. ఈ మహమ్మారితో పోరాడే వారి జీవన ప్రమాణం పెరుగుతోందని జీవన ప్రమాణం (Life Time) మెరుగుపడుతోందని తేల్చింది. అంటే.. లంగ్స్ క్యాన్సర్ ఉన్నప్పటికీ ఎక్కువ కాలం జీవించొచ్చట. అదెలాగో చూద్దాం..
ముందుగా కారణాలు తెలుసుకుందాం
- ఊపిరిత్తుల క్యాన్సర్ రావడానికి కారణాల్లో ధూమపానం ప్రధానమైనది. సిగరెట్, బీడీ, చుట్టా తాగడం వల్ల ఊపరితిత్తుల్లోకి పొగ వెళ్లి ఇది సంభవిస్తుంది. నికోటిన్, పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల ఇది వస్తుంది.
- లంగ్ క్యాన్సర్ రావడానికి మరోకారణం రేడియేషన్. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
- వాయుకాలుష్యం కూడా లంగ్స్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇది స్లమ్ ఏరియాల్లో అధికంగా ఉంటుంది. పర్యావరణ అసమతుల్యత వల్ల దీని బారిన పడతారు.
- అనువంశికత, వంశపార్యపరంగా కూడా లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉన్నా మిగతా వారికి కూడా ప్రమాదం అధికంగా ఉంటుంది. .
Lung Cancer లక్షణాలు ఇవే..
- ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశల్లో లక్షణాలు పెద్దగా కనిపించవు. ఈ వ్యాధి ముదిరే కొద్దీ ముఖ్యంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
- లంగ్ క్యాన్సర్ ఉన్నవారిని దగ్గు నిత్యం బాధిస్తుంది. తొలుత చిన్నగా మొదలై రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రాణాలు తోడేస్తుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది.
- ఈ క్యాన్సర్ ఉన్నవారు సరిగా శ్వాస తీసుకోలేరు. ఏదో అడ్డుకుంటున్నట్టు ఉంటుంది… శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది.
- నిత్యం ఛాతీలో నొప్పి ఉంటుంది.
- ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారికి రక్తం తొందరగా గట్టకట్టిపోతుంది. ఇది మరెన్నోరుగ్మతలకు దారి తీస్తుంది.
- శరీరంలో నిత్యం నిస్సత్తువగా ఉంటుంది. ఏదైనా పనిచేసినా, చేయకపోయినా, ఎటూ వెళ్లకుండా ఒకే చోట కూర్చున్నా, పడుకున్నా అలసట అధికంగా ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయొద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
డాక్టర్ ఏం చేస్తారంటే..
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు డాక్టర్‌కు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేస్తారు. సీటీస్కాన్, బయోప్సీ, పెట్ స్కాన్, మాలిక్యూలర్, జీనోమిక్ తదితర టెస్టుల ద్వారా నిర్ధారిస్తారు. ఈ పరీక్షల ద్వారా వ్యాధి స్థాయి, రకాన్ని కచ్చితంగా నిర్ధారించడం సాధ్యం.
అందుబాటులో ఉన్న చికిత్సలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగి ఆరోగ్య స్థితి, వయసు, వ్యాధి దశ తదితర అంశాల ఆధారంగా చికిత్స విధానం మారుతుంది. ప్రారంభ దశలో ఆపరేషన్ (Surgery) ద్వారా ఈ వ్యాధిని నయం చేయొచ్చు.
క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి కీమోథెరపీని ప్రయోగించి తద్వారా ఈ క్యాన్సర్‌ను తగ్గించొచ్చు. క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల్లో రోగనిరోధక శక్తిని పెంచే విధానాల్లో ఇమ్యునోథెరపీ ఒకటి. దీని ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించి జీవనప్రమాణాలను పెంచుతారు.
Lung Cancer.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- ధూమపానానికి (Smoking) దూరంగా ఉండాలి. సిగరెట్ , బీడీ, చుట్టా లాంటివి మానేయాలి.
- పౌష్టికాహారం తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం (Body Exercise) చేయాలి.
- కాలుష్యానికి (Pollution) దూరంగా ఉండాలి. అలాంటి ప్రదేశాల్లో తప్పకుండా మాస్క్‌ను ఉపయోగించాలి.
ఎవరైనా పొగ తాగుతుంటే.. వారికి దూరంగా ఉండాలి.
గుడ్‌న్యూస్ ఏమిటంటే..
ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడే వారికి అమెరికన్ శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. ఈ వ్యాధి బారిన పడేవారి జీవన ప్రమాణం క్రమేణా పెరుగుతోందని తేల్చారు. అంటే.. ఈ కాన్సర్‌తో బాధపడుతున్నా ఎక్కువకాలం బతికేయొచ్చట. పలు కేసులను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. గడిచిన ఐదేళ్లకాలంలో ఊపిరితిత్తుల కాన్సర్ నుంచి బతికే రేటు 26 శాతం మెరుగుపడిందని శాస్త్రవేత్తలు తమ వేదికలో పేర్కొన్నారు.
‘లంగ్స్ కాన్సర్‌తో బాధపడే వారి భవిష్యత్తు ఆశాజనంగా కనిపిస్తోంది. ఈ వ్యాధిగ్రస్థుల్లో జీవనప్రమాణాలు పెరుగుతున్నాయి. ఎక్కువకాలం బతికే రేటు మెరుగుపడుతోంది’ అని అమెరికన్ లంగ్స్ అసోసియేషన్ (ALA) అధ్యక్షుడు , సీఈవో హారాల్డ్ విమ్మర్ అన్నారు. అయితే.. దీనిపై మరింత పరిశోధనకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఎక్కువకాలం జీవించాలంటే..
క్యాన్సర్‌తో పోరాడేందుకు పలు జాగ్రత్తలు అవసరం. సరైన వైద్య పద్ధతులు పాటించాలి. మానసికంగా దృఢత్వాన్ని పెంచుకోవాలి. ఆరోగ్యకర జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. అప్పుడే జీవనప్రమాణం పెరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.