Asthma: దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా (Asthma) ఒకటి. అనేక సర్వసాధారణ రుగ్మతల్లా ఇది కూడా ఇబ్బంది పెడుతుంది. మహిళలు, పెద్ద వయసు ఉన్నవారు, ఎలర్జీ (Allergy) లక్షణం ఉన్నవారు, ధూమపానం (Smoking) చేసేవారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. వంశపార్యపరంగానూ ఈ వ్యాధి రావచ్చు. ఇది సోకిందంటే.. అస్తమానం ఇబ్బంది పడాల్సిందే. ఇది తీవ్రమైనప్పుడు పడే అవస్థ అంతా ఇంతా కాదు.
Asthmaతో అవస్థ
ఆస్తమా అనగానే చాలా మంది బెంబేలెత్తిపోతారు. జీవితాంతం ఈ జబ్బు (Asthma)తో బాధపడుతూ ఉండాల్సిందేనా..? అని మనోవేదనకు గురవుతారు. ఏ క్షణాన ప్రాణం పోతుందోననే ఆందోళన వీరిలో ఉంటుంది. అయితే.. ఈ వ్యాధి అంతా ప్రాణాంతకమేమీ కాదని అంటున్నారు వైద్య నిపుణులు. ఒకప్పుడిలా నయం కాని రోగం కాదని అంటున్నారు. జీవనశైలి (Life Style)లో మార్పు, మంచి ఆహారపు అలవాట్లు, అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సతో ఆస్తమా నుంచి ఉపశమనం కలిగించొచ్చని అభయం ఇస్తున్నారు. ఈ వ్యాధితో ఎక్కువ కాలం జీవించలేం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. దీన్ని పూర్తిగా అదుపులో ఉంచొచ్చని అంటున్నారు. అంతేకాదు.. ఇది రాకుండా మందులు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంటున్నారు.
ఎందుకు వస్తుందంటే..
ఆస్తమా అనేది వంశపార్యపరంగా సంక్రమించడానికి ఎక్కవ అవకాశాలు ఉంటాయి. దీనిని ఎటోపి అంటారు. అయితే.. ఎటోపి లక్షణం ఉంటేనే ఆస్తమా రావాలని కూడా ఏమీ లేదు. ఎటోపి (Atopy) లక్షణం లేని కొంతమందికి కూడా రావచ్చు. సాధారణంగా దుమ్ము, ధూళి, డస్ట్‌మైట్, పుప్పొడి, పొగ, చల్లని గాలి, వైరస్ వల్ల ఆస్తమా సంక్రమిస్తుంది. ఉద్వేగం ఎక్కువ ఉన్నవారికి, కొందరికి వ్యాయామం వల్ల కూడా ఆస్తమా రావచ్చు.
జలుబుతో మొదలై..
శ్వాస నాళాల్లోకి నేరుగా వెళ్లే ఎలర్జెన్స్ ఈ వ్యా ధిని కలిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చాలా మందిలో జలుబు (Cold)తో ఆస్తమామొదలవుతుంది. ఆతర్వాత గొంతునొప్పి వస్తుంది. గొంతులో నసగా ఉండటం, స్వరం మారడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. అనంతరం దగ్గు, ఆయాసం, పిల్లి కూతగా మారుతుంది. చల్లనిగాలి పీల్చినప్పుడు గానీ, పొగ, గాఢమైన వాసన వల్ల గానీ దగ్గు ఎక్కువ అవుతుంది. రాత్రిళ్లు అవస్థ అధికమవుతుంది. దగ్గు. ఆయాసం ఎక్కువగా ఉండటం వల్ల సరిగా నిద్ర పట్టదు. శ్వాస సరిగా ఆడదు. దీంతో గాలి పీల్చుకోవడం కోసం లేచి కూర్చుంటారు. ఫ్యాన్ ఎక్కువగా వేసుకోవటం, కిటికీ దగ్గర కూర్చోవడం చేస్తుంటారు. ఇలా రాత్రిళ్లు మాత్రమే ఆస్తమా ఉంటే దాన్ని నాక్టర్నల్ ఆస్తమా (nocturnal asthma) అంటారు.
పథ్యం తథ్యమా?
ఆస్తమా ఉన్నవారు పాటించే ఆహార నియమాలు ఎక్కువ. కొన్ని రకాల సిట్రస్ జాతికి చెందిన బత్తాయి, నిమ్మ వంటి పండ్లు, చేపలు, గుడ్డు తెల్లసొన, పాలు, చాక్లెట్లు, వేరుశనగలు వీరిలో కొందరికి పడవు. అ యితే.. చాలా మంది చాలా రకాల ఆహార పదార్థాలను అవైడ్ చేస్తారు. ముఖ్యంగా తీపి, నూనె, పండ్లు, పులుపు, పెరుగు, టమాటకు దూరంగా ఉంటారు. అయితే.. ఆస్తమా తీవ్రతకు ఇవే కారణమని కచ్చితంగా అనలేం. అందరిలోనూ ఈ సమస్య ఉండకపోవచ్చు. ఇలా మానేసిన ఆహార పదార్థాల వల్ల ఆస్తమా వస్తుందో .. లేదో పరీక్షించుకోవటం మంచిది. డాక్టర్ సలహాతోనే ఆహార నియమాలు పాటించాలి తప్ప.. అపోహలకు పోవద్దు. దీంతో పోషక విలువలు ఉన్న ఆహారం నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది.
ఎయిరోసాల్స్‌తో ఉపశమనం
ఆస్తమా అనేక పరిశోధనలు జరిగాయి. కొత్త కొత్త మందులు (Medicine) వచ్చాయి. శరీరంలోకి వీటిని నేరుగా శ్వాస నాళాల్లోకి పంపించటం లాంటి చికిత్స విధానం అందుబాటులోకి వచ్చింది. ఎయిరోసాల్స్ (Aerosols) అని పిలిచే ఈ ప్రక్రియ ద్వారా వ్యాధి లక్షణాల నుంచి త్వరితంగా ఉపశమనం కలిగించొచ్చు. ఈ ఎయిరోసాల్స్‌లో వాడే మందు మోతాదు చాలా తక్కువ కాబట్టి దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా అరుదు.
అయితే… ఆస్తమా బారిన పడేవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్యుడు సలహాల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడాలి.