Coffee Drinking Time: ఎవరికైనా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెప్పేటప్పుడు మనం ఏమని అంటాం? టైమ్‌కు తినమని చెబుతుంటాం. సమయానికి భోజనం చేయకుండా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని సూచిస్తుంటాం. అయితే.. ఇక నుంచి ఎవరికైనా జాగ్రత్తలు చెప్పేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా యాడ్ చేయండి. టైమ్‌కు కాఫీ తాగమని కూడా చెబుతుండండి. సమయానికి కాఫీ (Coffee) తాగకుండా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని సలహాలు ఇస్తుండండి. ఇలా ఒకరికి చెప్పడమే కాదు.. మీరూ ఈ జాగ్రత్తలు పడండి. Coffee Drinking Time పాటించండి. ఎందుకంటారా? అయితే.. చదవండి.
కాఫీ మంచిదా.. కాదా?
చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అది లేనిదే పొద్దుపోదు. మరికొందరు దానికి దూరంగా ఉంటారు. కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమని ఈ అలవాటును చేసుకోరు. అయితే.. కాఫీ తాగడం మంచిదా.. కాదా? అనే విషయంపై తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Coffee Drinking Time పాటిస్తే..
కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్షు పెరుగుతుందని తేలింది. అయితే.. ఇది కాఫీ తాగే టైమ్‌పై ఆధార పడి ఉంటుందట. ముఖ్యంగా ఉదయాన్నే కాఫీ (Coffee) తాగడం ఉత్తమమని ఈ అధ్యయనం పేర్కొంది. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఈ విషయం ప్రచురితమైంది.
ఇదే మొట్ట మొదటి అధ్యయనం!
కాఫీ తాగే సమయాన్ని పరిశీలించి, ఆరోగ్య ఫలితాలను పరిశోధించిన మొట్టమొదటి అధ్యయనం ఇదేనని ట్యూలేన్ యూనివర్శిటీలోని హెల్త్ పబ్లిక్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ లుకీ తెలిపారు. మనం ఆహారం తీసుకొనే విషయంలోనే కాకుండా కాఫీ తాగే విషయంలోనూ సరైన సమయాన్ని పాటించాలని అంటున్నారు.
40,725 మందిపై పరిశోధన
కాఫీ తాగే అలవాటు మంచిదా.. కాదా? అనే అంశంపై గతంలో అనేక అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. కొత్తగా చేసిన స్టడీ ప్రకారం కాఫీ ఎక్కువ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, పెరుగుతున్న వయసుకు సంబంధించిన మరణాల ప్రమాదం తగ్గుతుందని నిర్ధారణ అయ్యింది. అయితే.. కొన్ని ప్రత్యేక అంశాల విషయంలో మాత్రం దీనికి స్థిరమైన శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. ఈ అధ్యయనంలో వయసు 18 పైబడిన 40,725 మంది వ్యక్తుల ఆహార అలవాట్లను 1999 నుంచి 2018 వరకు పరిశీలించారు. ఉదయం 4:00 నుంచి 11:59 వరకు, మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం 4:59 వరకు, సాయంత్రం 5:00 నుంచి రాత్రి 3:59 వరకు కాఫీ తాగే సమయాలను విభజించారు. ఆ టైమ్‌లో కాఫీ తాగడం వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని పరిశీలించారు.
Coffee Drinking Timeపై ఫలితాలు ఏమొచ్చాయంటే..
- కాఫీ తాగని వారితో ఉదయం మాత్రమే కాఫీ తాగేవాళ్లను పోలిస్తే 16% తక్కువగా అకాల మరణాలు నమోదయ్యాయి. అలాగే 31% తక్కువ గుండె సంబంధిత మరణాల ప్రమాదాన్ని పసిగట్టారు.
- అయితే.. రోజు పొడవునా కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి మాత్రం అనారోగ్యం తప్పదని నిర్ధారించారు.
- నిర్దిష్ట సమయంలో ఉదయాన్నే కాఫీ తాగే వారిలో అనారోగ్య లక్షణాలు కనిపించలేదు.
- ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల శరీర క్లాక్ (సర్కేడియన్ రిథమ్), హార్మోన్ లెవల్స్, మెటబాలిజం సమతుల్యంగా ఉంటుందని తేలింది.
- కాఫీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఉబ్బరాన్ని తగ్గించి గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తాయని వెల్లడైంది..
కాఫీ తాగడం మంచిదే గానీ..
ఈ అధ్యయనం పరిశీలనా పద్ధతిలో జరిగింది. ప్రయోగాత్మకంగా (ఎక్స్‌పెరిమెంటల్) కాదు. కాబట్టి.. కాఫీ తాగడం, మరణాల ప్రమాదం మధ్య సంబంధం మాత్రమే చూపిస్తుంది. కారణాన్ని కాదు.
ఉదయం కాఫీ తాగే వ్యక్తుల్లో కొన్ని ఇతర అలవాట్లు ఉండొచ్చు. ఇవి అనారోగ్యానికి దారి తీయొచ్చు.
నిపుణుల సూచనలు పాటించాలి
ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉండటం ఆరోగ్యానికి మంచిదని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ, దీన్ని జాగ్రత్తగా ఆచరణలో పెట్టి, జీవితశైలిలో అనుసరించాల్సిన అంశాలపై నిపుణుల సూచనలు తీసుకోవడం అవసరం.