Colorectal cancer : డైటరీ ఫైబర్‌ను పేగు బ్యాక్టీరియా జీర్ణం చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే రసాయనాలు కొలొరెక్టల్ క్యాన్సర్ (Colorectal Cancer)ను నిరోధించడానికి సహాయపడతాయట. ఫైబర్ జీర్ణమైనప్పుడు శరీరంలోని వివిధ ప్రక్రియలను ప్రభావితం చేసే కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయని, అవి క్యాన్సర్ ఏర్పడకుండా నిరోధిస్తాయని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.
Colorectal Cancer అంటే?
కొలోరెక్టల్ క్యాన్సర్ (Colorectal Cancer) పెద్దపేగులో అభివృద్ధి చెందే మహమ్మారి. దీనినే బొవెల్ క్యాన్సర్ అని కూడా అంటారు. కణాల అసాధారణంగా పెరుగుదలతో ఇది సంభవిస్తుంది. ఇతర అంగాలపై దాడి చేస్తుంది. మలములో రక్తం పడటం, పేగు కదలికలో మార్పులు, బరువు తగ్గడం, తరుచువుగా అలసటగా ఉండటం దీని ముఖ్య లక్షణాలు.
Dietary fiber అంటే?
ఆరోగ్యకరమైన ఆహారంలో ఫైబర్ పాత్ర కీలకం. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. మనం తినే ప్లాంట్స్ ఫుడ్‌లోని జీర్ణం కాని భాగాన్ని డైటరీ ఫైబర్ (Dietary fiber) అంటారు. మన శరీరం దీన్ని జీర్ణించుకోలేదు. కానీ.. మన జీర్ణ వ్యవస్థలోని సూక్ష్మజీవులు దీన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఆ సమయంలో రెండు కాంపౌండ్లు ఉత్పత్తి అయ్యి క్యాన్సర్ వృద్ధిని నివారిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. ఫైబర్‌తో సమృద్ధిగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలనే సలహాను ఇది బలపరిచింది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి 1000 కిలో కేలరీలకు 14 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
Colorectal cancer ఏర్పడకుండా..
డైటరీ ఫైబర్ అనేది మనం జీర్ణించుకోలేని మొక్కల ఆహారంలోని భాగం. మన పేగులలో ఉండే మైక్రోబయోమ్ (బ్యాక్టీరియా సమూహం) ఈ ఫైబర్‌ను జీర్ణించుకుంటుంది. ఫైబర్ జీర్ణమైనప్పుడు శరీరంలోని వివిధ ప్రక్రియలను ప్రభావితం చేసే కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అయితే.. ఈ రసాయనాలు కొలొరెక్టల్ క్యాన్సర్ (Colorectal cancer) కణాల జన్యువులను ప్రభావితం చేసి, క్యాన్సర్ ఏర్పడకుండా నిరోధిస్తాయని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది.
సమగ్ర అధ్యయనమే గానీ..
మొక్కల ఫైబర్‌ను జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేసినప్పుడు క్యాన్సర్ వృద్ధిని నిరోధించడానికి సహాయపడే రెండు కాంపౌండ్లను ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఐర్లాండ్‌లోని అట్లాంటిక్ టెక్నాలజికల్ యూనివర్శిటీ స్లిగోలో హ్యూమన్ న్యూట్రిషన్‌లో అసిస్టెంట్ లెక్చరర్‌గా, ట్రినిటీ కాలేజ్ డబ్లిన్‌లో అడ్జంక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఈమన్ లైర్డ్ ఈ విషయంలో స్పందించారు. ఇది ఒక ప్రత్యేక పద్ధతిలో నిర్వహించిన సమగ్ర అధ్యయనమని ఆయన అన్నారు. అయితే.. అనేక సెల్‌లైన్ వైవిధ్యాలు, వాస్తవ జీవితాల పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
జీర్ణవ్యవస్థ పాత్ర
జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా ఫైబర్‌ను క్యాన్సర్ వ్యతిరేక సమ్మేళనాలుగా మారుస్తాయని అధ్యయనం చెబుతోంది. జీర్ణవ్యవస్థలోని మైక్రోబయోమ్ అనేది మనం తినే ఆహారాన్ని జీర్ణించుకోవడానికి సహాయపడే లక్షలాది బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో రూపొందించి ఉంటుంది. మనం మొక్కల ఫైబర్‌ను జీర్ణించుకోలేకపోయినప్పటికీ మన జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా దానిని మనం ఉపయోగించగలిగే అణువులుగా విచ్ఛిన్నం చేస్తాయి.
పేగుల్లో కణితులు ఏర్పడకుండా..
మైక్రోబ్‌లు ఫైబర్ నుంచి ఉత్పత్తి చేసే ఒక రకమైన అణువులు షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు (SCFAs). SCFAs రోగనిరోధక ప్రతిస్పందనలను మాడ్యులేట్ చేయడానికి అవసరం. పేగుల్లో కణితుల ఏర్పాటును నిరోధించడానికి సహాయపడతాయి.
Colorectal cancer నుంచి రక్షణ
ఈ అధ్యయనంలో పరిశోధకులు జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే రెండు SCFAs, ప్రోపయోనేట్, బ్యూటైరేట్‌ల ప్రభావాలను ఆరోగ్యకరమైన, కోలన్ క్యాన్సర్ కణాలపై పరిశోధించారు. ప్రోపయోనేట్ ఆకలిని, కొలెస్ట్రాల్‌ను తగ్గించొచ్చని, బ్యూటైరేట్ మంటను నియంత్రించడానికి, రోగనిరోధక ప్రతిస్పందనలను నియంత్రించడానికి, కొలరెక్టల్ క్యాన్సర్ (Colorectal cancer)నుంచి రక్షించడానికి సహాయపడుతుందని గత అధ్యయనాలు సూచించాయి. ప్రోపయోనేట్, బ్యూటైరేట్ రెండూ అనేక వివిక్త మానవ కణ రకాలలో జన్యు వ్యక్తీకరణ చేస్తాయని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు:
ముఖ్యంగా ఈ ఎపిజెనిటిక్ మార్పులు కణాల విభజన, గుణకారాన్ని నియంత్రించే జన్యువులలోనూ, ప్రోగ్రామ్ చేయబడిన కణ మరణం లేదా అపోప్టోసిస్‌ను నియంత్రించే జన్యువులలోనూ సంభవిస్తాయని వెల్లడించారు. క్యాన్సర్ల వృద్ధిని నియంత్రించడానికి లేదా అంతరాయం కలిగించడానికి ఈ ప్రక్రియలు దోహదపడగాయని తేల్చారు.