Depression : డిప్రెషన్ అనే మానసిక సమస్య మనిషిని సతమతం చేస్తుంది. దీంతో బాధపడేవారికి ఏదీ సరిగా బోధపడదు. మనసు కుదటగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఆలోచన… ఆందోళన. ఏదో భయం.. ఆత్మనూన్యతాభావం వెంటాడుతుంది. ఎవరినీ నమ్మని తత్వం అలవడుతుంది. దీర్ఘకాలిక ఈ రుగ్మత వల్ల మనంతట మనమే అనేక అనర్థాలను కొనితెచ్చుకుంటాం. మనసును కుంగదీసే ఈ డిప్రెషన్ మనసిక సమస్యలే కాకుండా శారీరక వ్యాధులకు దారి తీస్తుంది. ఇది వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఏ పనిని కూడా సరిగా చేయలేం. కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేం. వృత్తి, (Depression) ఉద్యోగపర విధులను సరిగా నిర్వర్తించలేం. కోపతాపాలకు ఈ డిప్రెషన్ ఆజ్యం పోస్తుంది కూడా. తద్వారా మానవ సంబంధాలను విచ్ఛిన్నమవుతాయి. కుటుంబంలో కలహాలకు కారణమవుతుంది. డిప్రెషన్‌తో బాధపడే విద్యార్థులు చదువుల పట్ల చిరాకు, నిర్లక్ష్యాన్ని కనబరుస్తారు. ఉద్యోగార్థుల్లో ఇది ఆవహించిందంటే.. ఏమాత్రం ముందడగు పడదు. నిరాశ నిష్ఫృహలు దరిచేరుతారు. జాప్ పొందడం అసాధ్యమనే భావం నాటుకుపోతుంది. ఇలా జీవితంలో అడుగడుగునా ఈ డిప్రెషన్ అనేది అడ్డుగోడగా మారుతుంది.
అయితే.. దీన్ని అధిగమించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. డిప్రెషన్‌ను సమర్థంగా నివారించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
మందుగా ఏం చేయాలంటే..
ముందుగా డిప్రెషన్ కారణమైన మూలాలను గుర్తించాలి. దీన్ని ఎదుర్కోవడానికి మొదట మన భావాలను మనం అర్థం చేసుకోవాలి. మానసిక ఒత్తిడి, బాధ గనుక ఉంటే అవి ఎలా వచ్చాయనేది గుర్తించాలి. ఆవేశపూరిత భావాల నుంచా.. జీవితంలో ఎదురవుతున్న కష్టాల ప్రభావం వల్లనా? అనే విషయాలను గుర్తించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఆలోచనలకు తావివ్వొద్దు. భావోద్వేగాలకు లోనుకావద్దు. పాజిటివ్‌గా ఆలోచించాలి.
జరంత కసరత్తు అవసరం
డిప్రెషన్‌ను తగ్గించుకోవడానికి మనిషికి జరంత కసరత్తు అవసరం. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం (exercise) చేయాలి. దీని వల్ల అండార్పిన్స్ అనే హార్మోన్స్ విడుదలవుతాయి. మనసును ప్రశాంతంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంచేందుకు ఇవి దోహదపడతాయి. వాకింగ్ (walking), యోగా, ధ్యానం, క్రీడల వల్ల శరీరంలో చలనం పెరిగి మెదడును పదును పెడుతుంది. తద్వారా డిప్రెషన్ నుంచి దూరంగా ఉంచుతుంది.
మంచి డైట్‌ను ఫాలో కావాలి
డిప్రెషన్‌ను తగ్గించడంలో ఆహార నియమాలు కీలకపాత్ర పోషిస్తాయి. మంచి డైట్ (diet)ను ఫాలో కావాలి.
సమతుల ఆహారం తీసుకోవాలి, విటమిన్ B, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు అధికంగా కలిగిన ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి. మద్యం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
నిద్ర సరిగా లేకపోతే..
మానవ జీవితానికి సరైన నిద్ర ఎంతో ముఖ్యం. మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇది ప్రధాన పాత్రపోషిస్తుంది.
సరైన నిద్ర లేకపోవడం కూడా డిప్రెషన్‌కు కారణమవుతుంది. రోజూ నిర్దిష్ట సమయంలోనే నిద్రకు ఉపక్రమించాలి. కనీసం 7-8 గంటలపాటు నిద్రపోవాలి. నిద్రపోయే గది చీకటిగా ఉండాలి. చాలా మంది బెడ్‌పై వాలిపోగానే మొబైల్, టీవీను చూడ్డం మొదలెడతారు. వాటన్నింటినీ కట్టేసి నిద్రకు ఉపక్రమించాలి.
ఫీలింగ్స్‌ను షేర్ చేసుకోవాలి
డిప్రెషన్ (Depression) తో బాధపడే అత్యధికులు తమ ఫీలింగ్స్‌ను ఎవరికీ షేర్ చేసుకోరు. ఇది మంచిది కాదు. మన భావాలను, సమస్యలను నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలి. ఫ్రెండ్స్‌కు లేదా కుటుంబ సభ్యులకు లేదా మనకు అండగా నిలబడే ఆత్మీయులకు చెప్పుకోవాలి. దీంతో గుండె పైనుంచి పెద్ద భారాన్నిదింపినట్టవుతుంది. మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది.
మనసును ఉత్తేజ పర్చే హాబీలు
ఏదైనా అంశంలో ఆసక్తులు ఉంటే వాటికి వెంటనే కార్యరూపం ఇవ్వాలి. ఈ హాబీలు మనసును ఉత్తేజ పరుస్తాయి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, లేదా ప్రకృతిలో గడపడం వంటివి కూడా డిప్రెషన్‌ను దూరం చేస్తాయి.
తీవ్రమైనప్పుడు ఏం చేయాలి?
డిప్రెషన్ తీవ్రమైనప్పుడు మానసిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. సైకియాట్రిస్ట్ లేదా కౌన్సిలర్ ద్వారా దీన్ని అధిగమించొచ్చు. కొన్నిసార్లు మందులు కూడా అవసరం పడొచ్చు. ఇలాంటి చికిత్సల వల్ల డిప్రెషన్‌ను తగ్గించుకోవచ్చు.
చివరికో మాట..
డిప్రెషన్ (Depression) అనేది ఒక రుగ్మత అయినప్పటికీ దాన్ని సరైన సమయంలో గుర్తిస్తే మరీ అంత డేంజరస్ కూడా కాదు. ఇది ఒక పెద్ద సవాల్‌గా కనిపించొచ్చు. కానీ ఇది సాధారణ సమస్య. సరైన మార్గాల్లో చర్యలు తీసుకుంటే జీవితాన్ని మళ్లీ ఆనందంగా మార్చుకోవచ్చు.
Nice