Hand washing : చాలా మందికి చేతులు శుభ్రంగా ఉంచుకొనే అలవాటు ఉండదు. దీన్ని ఆషామాషిగా తీసుకుంటారు. భోజనానికి ముందు సబ్బుతో హ్యాండ్ వాష్ (Hand Washing) చేసే వారు అరుదైతే.. అస్సలు సాధారణంగా వాటర్‌తో కూడా కడుక్కోని వారు చాలా మందే ఉంటారు. అంతెందుకు.. మరుగుదొడ్డికి వెళ్లొచ్చాక కూడా చేతులు కడుక్కోని వారూ కోకొల్లలు. ఈ అలవాటు మంచిది కాదని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా అంటురోగాల బారిన పడతారు.
మన శరీర అవయవాల్లో ఒకదానికొకటి తాకనివి చాలా ఉంటాయి. ఉదాహరణకు నోరు ముక్కును తాకదు. ముక్కు చెవులను తాకదు. చేతులు మాత్రం అన్నింటినీ తాకుతాయి. అందుకే .. చేతుల పరిశుభ్రత అత్యంత ప్రధానం. ఆరోగ్య పరిరక్షణకు ఇదెంతో దోహదపడుతుంది. అనేక ఇన్‌ఫెక్షన్ల (infections)కు కారణం చేతులేనని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎన్‌హెచ్‌టీఎం) డైరెక్టర్ వాల్ కర్టిస్ పేర్కొన్నారు. చేతులు శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని ఇలాంటి ఎన్నో అధ్యాయనాలు చెబుతున్నాయి. సబ్బుతో చేతులు కడుక్కోవడమనేది ఒక స్వీయ టీకాలా పనిచేస్తుందని అంటున్నాయి. ఇది ఇన్ఫెక్షన్లను నివారించి, ఆరోగ్యాన్ని కాపాడుతుందని వివరిస్తున్నాయి.
ఎంతమంది ఉన్నారంటే..
భారతదేశంలో సబ్బుతో చేతులు కడుక్కొనే వారు తక్కువ మందే ఉంటారని యూనిసెఫ్ తేల్చింది. మొత్తం జనాభాలో53 శాతం మాత్రమే మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కుంటారని లెక్కలు తీసింది. 38 శాతం మంది తినడానికి ముందు, 30 శాతం మంది వంట చేయడానికి ముందు మాత్రమే హ్యాండ్ వాష్ చేస్తారట.
రోగాలు రాకుండా..
అంటువ్యాధుల (Infectious diseases) కారణంగా ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మృతి చెందుతున్నారు. ఈ అంటువ్యాధులకు మైక్రోబుల్స్ (సూక్ష్మజీవులు /viruses) కారణమని తెలుస్తోంది. చేతుల ద్వారా ఇవి వ్యాప్తి చెందుతాయి. చేతులు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట. హానికర క్రిములను, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైన అంటువ్యాధుల వ్యాప్తిని ఇది నివారిస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. తినే ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడాన్ని అలవాటు చేసుకుంటే అంటువ్యాధులను నివారించుకోవచ్చని అంటున్నారు. రోగాలు రాకముందు తీసుకొనే వ్యాక్సిన్ల కన్నా హ్యాండ్‌వాష్ అనేది అనేక రెట్లు ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. డయేరియా వల్ల మరణాలను సగానికి, తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను నాలుగో వంతు వరకు తగ్గించడానికి హ్యాండ్‌వాష్ ఎంతో కీలకమని అంటున్నారు.
Hand washing ఎలా చేసుకోవాలి?
చేతులు శుభ్రం చేయడమంటే నీటితోపాటు మరేదైనా ద్రవం లేదా సబ్బుతో కడుక్కోవడం. చేతులపై ఉన్న మట్టిని, మురికిని, సూక్ష్మక్రిములను తొలగించే ప్రక్రియ. సబ్బు (Soap)తో చేతులు తరచుగా కడుక్కోవడం ద్వారా కలుషిత నీరు, ఆహారం లేదా అపరిశుభ్రమైన పరిసరాల నుంచి వచ్చే జర్మ్స్ (germs) తొలగిపోతాయి. ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి. అక్కడా ఇక్కడా అని కాదు.. ప్రతి చోటా ఈ పద్ధతిని అవలంబించాలి.
మరి మనమేం చేస్తున్నాం?
కాళ్లూ చేతులు కడుక్కోవడం వ్యక్తిగత పరిశుభ్రతలో ఒక భాగం. అయితే.. చేతుల పరిశుభ్రతకు చాలా మంది ప్రాధాన్యమివ్వరు. ఆహారం తీసుకోవడానికి, మరుగుదొడ్డికి చేతులు ఉపయోగించడం భారతీయుల అలవాటు. ఇది మన సంస్కృతిగా భావిస్తారు. అంతేగానీ.. ఆహారం తీసుకొనే ముందు, మరుగుదొడ్డికి వెళ్లొచ్చాకా చేతులు కడుక్కోవాలనే ఆలోచన మాత్రం చాలా మందికి ఉండదు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు లాంటి బహిరంగ ప్రదేశాల్లో సైతం చేతులు కడుక్కోకుండానే ఏది పడితే అది తినేస్తారు. తాగడానికి వాటర్ బాటిల్ వెంట ఉంచుకుంటారు గానీ, సబ్బును మాత్రం ఉంచుకోరు. ఇది మంచి పద్దతి కాదు. ఇలాంటి అలవాటును మానుకోవాలి. ప్రతి ఒక్కరూ హ్యాండ్ వాష్‌ను తప్పసరిగా పాటించాలి. తద్వారా ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి.