Influenza (flu) : శీతాకాలంలో వాతావరణ మార్పుతో ఆరోగ్య సమస్యలు రావడం సహజం. ఈ సీజన్‌లో వ్యాప్తి చెందే వ్యాధుల్లో ఇన్‌ఫ్లుయోంజా (Influenza (flu) )ప్రధానమైనది. దీన్ని ఫ్లూ అని కూడా అంటారు. దీని వైరస్‌ను ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అంటారు. ఇది మనుషుల్లోనే కాదు.. పక్షులు, ఇతర జీవుల్లో కూడా కనిపిస్తుంది.
Influenza (flu) అంటే.. జలుబు కాదు
ఇన్‌ఫ్లుయెంజాను సాధారణంగా చాలా మంది జలుబుగా భావిస్తారు. శ్వాస వ్యవస్థకు సంబంధించిన సమస్య అనుకుంటారు. కానీ.. ఇది ప్రత్యేక వ్యాధి. ప్రత్యేక వైరస్ వల్ల వచ్చే రుగ్మత. దీని వల్ల కొన్ని సందర్భాల్లో వాంతులు, వికారం కూడా ఉండొచ్చు. కేవలం జలుబు ఉన్నవారిలో ఈ సమస్యలు కనిపించవు. ఇన్‌ఫ్లుయెంజా ఇతర శ్వాస సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా న్యూమోనియా, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ రోగి తుమ్మడం లేదా దగ్గడం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
Influenza (flu) లక్షణాలు
జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, చాలా అలసటగా అనిపిస్తుంది. చెమటలు పట్టడం, చలిగాను ఉండటం లాంటి మిశ్రమ లక్షణాలు కనిపిస్తాయి.
ఎవరు ఎక్కువగా ప్రభావితమవుతారు?
ఈ వ్యాధి వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే వారు:
- వయస్సు మీదున్న పడ్డవారు
- చిన్నపిల్లలు
- బలహీన రోగనిరోధక శక్తి కలవారు
- షుగర్ లాంటి క్రానిక్ వ్యాధులు ఉన్నవారు
- ఇవి ఉన్నవారు న్యూమోనియా, బ్రోంకైటిస్, శ్వాససంబంధ, చెవుల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ.
ముఖ్యమైన సూచనలు:
- శీతాకాలంలో ఇన్‌ఫ్లుయెంజా మరింత వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా తేమ, చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది.
- మీరు వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీ గదిలోనే ఉండండి. బయటకు వస్తే ఇది ఇతరులకు వ్యాపించొచ్చు.
- ఇతరులు ఇన్‌ఫ్లుయెంజాతో బాధపడుతుంటే వారితో దూరంగా ఉండండి.
- తుమ్మడం లేదా దగ్గే సమయంలో ముక్కు, నోటి మీద కర్చీఫ్ పెట్టుకోవాలి.
- చేతులు, ముఖం సబ్బుతో శుభ్రంగా కడగాలి.
- శుభ్రం చేయకుండా మీ కళ్లు, ముక్కు నోటిని తాకొద్దు.
Influenza (flu) బారిన పడొద్దనుకుంటే..
- టైమ్‌కు నిద్రపోండి.
- వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.
- మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి.
- నీళ్లను ఎక్కువగా తాగండి.
- పండ్లు, కూరగాయలను తరచూ తినడం అలవాటు చేసుకోండి.
- ఇన్‌ఫ్లుయెంజా ఉన్నట్టు లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించండి. వైరస్ వల్ల వచ్చిన సమస్య కాబట్టి సొంత వైద్యం పనికి రాదు. కచ్చితంగా డాక్టర్‌కు చూపించుకోవాలి.