A New Study: నిద్ర అంటే కేవలం అలసట పోగొట్టడానికే కాదు… మేధస్సును బలోపేతం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందట. తాజాగా ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. కొద్ది సేపు కునుకు (Nap) తీసినా మన మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు పరిశోధకులు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ (Harvard Medical School)లోని పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం జనరల్ ఆఫ్ న్యూరోసైన్స్ (Journal of Neuroscience) అనే పత్రికలో ప్రచురితమైంది. 25 మందిపై ఈ పరిశోధన జరిగింది. వారికి టైపింగ్ సీక్వెన్స్ నేర్పించి, ఆ తర్వాత స్వల్ప నిద్ర తీయమని చెప్పారు.
A New Study : నిద్రలో మెమరీ ప్రాసెసింగ్
ఈ అధ్యయనంలో ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే.. నిద్ర సమయంలో మెదడు కార్టెక్స్ (Cortex – మెదడులోని బయటి పొర) ఎక్కువగా యాక్టివ్‌గా మారుతుంది. ముఖ్యంగా ముందు పని చేసిన సమయంలో యాక్టివ్‌గా ఉన్న మెదడు భాగాలు… నిద్రలో ఉన్నప్పుడు రిథమిక్ (rhythmic), పునరావృత (repetitive) తరహాలో పనిచేస్తాయని గుర్తించారు. మనం నేర్చుకున్న సమాచారాన్ని నిద్ర సమయంలో మెదడు ప్రాసెస్ చేస్తోందని ఇది సూచించింది. అంటే.. తాత్కాలికంగా మెదడులోకి వచ్చిన సమాచారం అనేది నిద్ర సమయంలో స్థిరమైన, దీర్ఘకాలిక జ్ఞాపకంగా మారుతుందన్నమాట.
పనితీరు మెరుగుపడిందిలా..
నిద్ర తర్వాత పాల్గొన్నవారి పనితీరులో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ముఖ్యంగా మెదడులో ‘ప్లానింగ్ మూవ్‌మెంట్’ (Planning Movement)కు సంబంధించి ఉన్న ప్రాంతాల్లో బ్రెయిన్ యాక్టివిటీ పెరిగింది. నిద్రకు ముందు కేవలం ‘చర్యలు చేసే భాగాలు’ (Motor Execution Regions) యాక్టివ్‌గా ఉన్నా ఆ తర్వాత ‘ప్లానింగ్’ కి సంబంధించిన మెదడు భాగాల్లో కూడా యాక్టివిటీ మెరుగుపడింది. ఇది భవిష్యత్‌లో మెరుగైన పనితీరు సాధించడంలో సహాయపడే సూచనగా పరిశోధకులు పేర్కొన్నారు.
నిద్రలో మెదడు తరంగాలు (Brain Rhythms)
హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన సైకాలాజీ ప్రొఫెసర్ డానా మనోచ్ (Dana Manoach) ఈ పరిశోధన గురించి ఆసక్తిగల విషయాలు చెప్పారు. “నిద్ర సమయంలో మెదడు మొత్తం రిథమిక్ తరంగాలతో నిండి ఉంటుంది. కానీ.. నేర్చుకున్న తర్వాత ఈ తరంగాలు మరింతగా ప్రబలతాయి. దీని వల్ల జ్ఞాపకాలు స్థిరపడి, ఆ తర్వాత బలపడతాయి.” అన్నారు. ఈ బ్రెయిన్ రిథమ్స్ అన్నింటికన్నా ముఖ్యమైనవి. ఇవి మెమరీ ఫంక్షన్ బలోపేతానికి అవసరం. మరింతగా చెప్పాలంటే ఈ తరంగాలు “మెడిటేషన్”లో గమనించే అఫెక్ట్‌లను పోలి ఉంటాయని కూడా చెప్పొచ్చు.
ప్రకృతి ప్రసాదించిన మెమరీ బూస్టర్
మనం ఒకే ఒక పని మీద ఎక్కువ సమయం కష్టపడితే మెదడు అలసిపోతుంది. అయితే.. చిన్న నిద్ర తీసుకుంటే మెదడు ఆ పని సంబంధించిన సమాచారాన్ని జీర్ణించుకుని, జ్ఞాపకాలుగా నిలుపుతుందని ఈ పరిశోధన ద్వారా తేలింది. ఈ ప్రక్రియను శాస్త్రంలో Memory Consolidation అంటారు. అంటే.. తాత్కాలిక మెమరీ అనేది స్థిరమైన జ్ఞాపకంగా మారుతుందన్నమాట. అందువల్లే విద్యార్థులు పరీక్షల ముందు చిన్న నిద్ర తీసుకోవడం వల్ల చదువులో మెరుగైన ఫలితాలు వస్తాయని అంటున్నారు నిపుణులు. అలాగే ఉద్యోగులు, క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కూడా మధ్యాహ్న సమయంలో చిన్న నిద్ర తీసుకుంటే, ఆ తర్వాత వారి పనితీరు చాలా మెరుగవుతుందని అంటున్నారు.